జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, సమయపాలనతో అమలు చేస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సమీక్షలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
జిల్లాలో ఇప్పటివరకు సుమారు 70 శాతం ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన 30 శాతం పనులను అత్యంత ప్రాధాన్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నియోజకవర్గాలు, మండలాలు, పోలింగ్ బూతుల వారీగా మ్యాపింగ్ పురోగతిని సమగ్రంగా విశ్లేషించారు.
మణుగూరు మండలంలో కేవలం 37 శాతం మ్యాపింగ్ పూర్తవ్వడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతంలో ఉద్యోగుల బదిలీలు, ఇతర కారణాల వల్ల మ్యాపింగ్ ఆలస్యమైందని అధికారులు తెలిపారు. మ్యాపింగ్ వేగవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రతి బీఎల్ఓకు రోజువారీ లక్ష్యాలు నిర్దేశించి, నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఖచ్చితమైన వివరాలు సేకరించి మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ శాతం తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి, జాప్యానికి గల కారణాలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని తెలిపారు. అవసరమైన సిబ్బంది, సాంకేతిక సహకారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మ్యాపింగ్ ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం తప్పనిసరిగా పాటించాలని, ఎటువంటి లోపాలు లేకుండా డేటా నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాధా బైనమా దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి, వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.











