ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల భద్రతతో పాటు ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు రూ.10 వేల కోట్లు ఆదా చేశారని, 290 కోట్ల ప్రయాణాలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్లను అందజేసి, బహుమతులు కూడా అందించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. డిసెంబర్ 9, 2023 నుండి అమలులోకి వచ్చిన ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు డబ్బు ఆదా చేసుకొని, దానిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని, ఇది వారి ఆర్థిక ప్రగతికి, భద్రతకు తోడ్పడుతుందని తెలిపారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ, పాఠశాలల అభివృద్ధి పనులు మహిళా సంఘాలకు అప్పగించడం, యూనిఫాం కుట్టించడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు.
మహిళా సంఘాలకు రుణ బీమా, ప్రమాద బీమా, బ్యాంక్ లింకేజ్ రుణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, మహిళలు మరింత ముందుకు వెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఆర్టీసీ డీఎంలు, మెప్మా ఏవో, తహసీల్దార్, సిబ్బంది పాల్గొన్నారు.







