రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.
దేవాలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, వసతి వంటి కీలక అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో భాగంగా, ఆలయ పరిసరాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు.
సమావేశంలో ఆర్ & బి చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, తహసిల్దార్ పవన్ చంద్ర, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.












