కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సేవలందించిన నలుగురు పోలీసు అధికారులకు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. వీరి పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలంపాటు విశేష సేవలందించిన నలుగురు పోలీసు అధికారులకు మంగళవారం కరీంనగర్ కమీషనరేట్ కార్యాలయంలో ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీసీఆర్బీ నుండి ఎస్సై రాజేశం, స్పెషల్ బ్రాంచ్ నుండి ఎస్సై మహమ్మద్ జమీరుద్దీన్, ఏఆర్ విభాగం నుండి ఏఆర్ఎస్సైలు యం.డి. ఇక్బాల్, యం.డి. అంకుషావలి పదవీ విరమణ పొందారు.
కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై, పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగంలో విజయవంతంగా, నిబద్ధతతో సేవలు అందించిన అధికారులను అభినందించారు. వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
అడిషనల్ డీసీపీ స్వయంగా పదవీ విరమణ పొందిన నలుగురు అధికారులకు పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలు అందజేసి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ తర్వాత అధికారులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్ జి, కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్సై మామిడి సురేందర్, ఇతర అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.











