మహబూబ్నగర్ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న భార్యను 8 నెలలకే భర్త గొంతు నులిమి హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన నిందితుడు, పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నాడు.
కుటుంబ సభ్యుల వ్యతిరేకతను ధిక్కరించి గ్రామానికి చెందిన చందును వివాహం చేసుకున్న శ్రీదేవి (21), వివాహమైన 8 నెలల్లోనే భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. నర్సింగ్ పూర్తి చేసిన శ్రీదేవి, వివాహానంతరం భర్త మద్యం సేవించి వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం.
శుక్రవారం రాత్రి జరిగిన గొడవలో శ్రీదేవిని చందు గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం, మృతదేహాన్ని గోనె సంచిలో వేసి పొలానికి తరలించి, చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకం ఆడాడు. మృతురాలి సోదరుడికి ఫోన్ చేసి తప్పుడు సమాచారం అందించాడు.
గ్రామస్థులు అక్కడికి చేరుకునేసరికి నిందితుడు పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదికలో శ్రీదేవి హత్యకు గురైనట్లు నిర్ధారణ కావడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించారు.
హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు చందును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చందు నేరం అంగీకరించినట్లు సమాచారం. హత్యకు గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.











