బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో అతని ఐదేళ్ల కుమారుడు ప్రత్యక్ష సాక్షిగా మారాడు.
తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి బోయకొండ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హత్యకు గురైనట్లు సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హత్య జరిగిన సమయంలో, గాంధీ ఐదేళ్ల కుమారుడు సందీప్ అక్కడే ఉన్నట్లు, తండ్రి హత్యను ప్రత్యక్షంగా చూసినట్లు సమాచారం. రాత్రంతా తండ్రి మృతదేహం పక్కనే అడవిలో గడిపిన బాలుడు, ఉదయం సుమారు 1.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి సమీపంలోని అంగన్వాడీ టీచర్‌కు విషయం చెప్పాడు.
అంగన్వాడీ టీచర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, గాంధీ మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అక్రమ సంబంధం కారణంగానే నరసింహులు అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి గాంధీని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో మృతుడి భార్య రాఫాతి పరారీలో ఉన్నట్లు సమాచారం. పుంగనూరు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.









