కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో సహా పలువురికి ఊరటనిస్తూ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చిలో జారీ చేసిన జీవో నంబర్ 6 ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. అయితే, ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావు, స్మిత సబర్వాల్, ఎస్కే జోషి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం, ఏప్రిల్ 8న వాదనలు ముగిశాయి. తీర్పును ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.
న్యాయస్థానం జీవో నంబర్ 6ను సమర్థించినప్పటికీ, కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించకుండానే మీడియా ముందుకు తీసుకురావడాన్ని తప్పుబట్టింది. కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో కేసీఆర్, హరీశ్ రావు వంటి వారికి తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది.
కేసీఆర్ తరపు న్యాయవాది గండ్రమోహన్ రావు మాట్లాడుతూ, హైకోర్టు తీర్పుతో కేసీఆర్‌కు ఊరట లభించిందని, కమిషన్ నివేదికను చెత్తలో పడేయవచ్చని వ్యాఖ్యానించారు. సెక్షన్ 8 కింద విచారణ జరగలేదని, పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించినప్పటికీ, దాని నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయరాదని న్యాయస్థానం చెప్పిందని ఆయన వెల్లడించారు.











