జిన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ్ విద్యార్థులు తమ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత తమ గురువులను, సహాధ్యాయులను కలుసుకుని బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు.
పాఠశాల పూర్వ విద్యార్థులు తమ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మాధారం శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 80 మంది విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
సహవిద్యార్థులతో పాటు, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కూడా ఈ సందర్భంగా సన్మానించారు. గణితం, ఆంగ్లం, సాంఘిక శాస్త్రం, తెలుగు బోధించిన ఉపాధ్యాయులను జ్ఞాపికలతో సత్కరించారు. గురువుల ఆశీస్సులు అందుకున్నారు.
జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల విజయమే తమకు నిజమైన గౌరవమని, వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గురువుల మార్గదర్శకత్వమే తమ జీవితాలను తీర్చిదిద్దాయని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
క్రమశిక్షణ, విలువలు, సమాజం పట్ల బాధ్యత వంటివి గురువుల నుంచే నేర్చుకున్నామని విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సమ్మేళనం గురు-శిష్య బంధానికి, పూర్వ విద్యార్థుల అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది.











