హోంవర్క్ చేయలేదన్న కారణంతో రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో సుమారు 15 మంది విద్యార్థులపై హెచ్ఓడీ కేబుల్ వైరుతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తూర్కలఖానాపూర్ గ్రామ శివారులోని రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. సీఎస్ఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను హెచ్ఓడీ శివారెడ్డి కేబుల్ వైరుతో చితకబాదినట్లు బాధితుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విద్యార్థుల కథనం ప్రకారం, హోంవర్క్ రాయలేదని ఆగ్రహించిన హెచ్ఓడీ, గదిని లాక్ చేసి ఇష్టం వచ్చినట్లు దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో సాత్విక్, సందీప్, వినయ్, మహేష్, రామ్, సాయి కిరణ్, నవదీప్ సహా పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.
విషయం తెలిసిన వెంటనే కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు, సంబంధిత లెక్చరర్‌ను ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా స్పందించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విద్యాబోధన అందించాల్సిన ఉపాధ్యాయులే దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. రత్నపురి విద్యాసంస్థల ప్రతినిధి రఘు మాట్లాడుతూ, విద్యార్థులపై దాడి జరగడం విచారకరమని, దీనిపై హెచ్ఓడీని వివరణ కోరినట్లు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

