ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రవేశాలను పెంచడం, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం వంటి అంశాలపై విద్యాశాఖ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో విస్తృతంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ, అభినవ్ అభిలాష, విద్యా శాఖ సెక్రెటరీ యోగితారాణా, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలిన్, హయ్యర్ ఎడ్యుకేషన్ దేవసేన అధ్యక్షతన జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో, “ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట” ప్రవేశాల ప్రత్యేక కార్యక్రమంపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBVs), మోడల్ స్కూళ్లలో విద్యార్థుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
అలాగే, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. భవిత కేంద్రాల బలోపేతం, కొత్త ప్రీ-ప్రైమరీ విభాగాల ప్రారంభం, జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల పునఃప్రారంభం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.
డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా, AXL, AI-Pi-Jam వంటి వేదికల వినియోగాన్ని పెంచాలని సూచనలు చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ సకాలంలో పంపిణీ చేయడంతో పాటు, సెర్ప్ బృందాల ద్వారా యూనిఫార్ముల కుట్టింపు, పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతి జిల్లాలో విద్యా కార్యక్రమాల అమలుపై నిరంతర పర్యవేక్షణతో పాటు రోజువారీ పురోగతి సమీక్ష నిర్వహించాలని సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సమీక్షల ద్వారా విద్యా వ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని అధికారులు తెలిపారు.











