గ్రామాల్లో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ బి. హన్మంతరావు (ఎఫ్ఏసీ) హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
గ్రామాల్లో లైసెన్స్ లేదా పర్మిట్ లేకుండా మద్యం నిల్వ ఉంచడం, విక్రయించడం లేదా బెల్టు దుకాణాలు నిర్వహించడం తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 34(a) ప్రకారం నేరమని ఆయన స్పష్టం చేశారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపుల నిర్వహణపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు.
డిసెంబర్ 1, 2025 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 91 కేసులు నమోదు చేసి 90 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో 307.4 లీటర్ల మద్యం, 140 లీటర్ల బీర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని ఏ4 షాపుల లైసెన్స్ దారులు ఒక్క వ్యక్తికి అధిక మొత్తంలో లిక్కర్ లేదా బీర్ విక్రయించరాదని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, బెల్టు షాపుల సమాచారాన్ని వెంటనే ఎక్సైజ్ శాఖకు తెలియజేయాలని కోరారు.











