అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో పోలీసులు భర్తను అరెస్టు చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, వివాహం జరిగిన కొద్ది రోజులకే భర్త, అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు.
శిమ్మపేటకు చెందిన తేజశ్రీ(22)కి మార్చి 6న శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెంకు చెందిన రుప్ప మల్లేషు కుమారుడు సోమేష్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 20 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే, వివాహం జరిగిన మొదటి రోజు నుంచే భర్త సోమేష్ వేధింపులకు పాల్పడినట్లు తేజశ్రీ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
విశాఖపట్నం ఎల్అండ్టీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న సోమేష్, నావల్ డాక్‌యార్డ్‌లో ప్రాజెక్టు డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ విశాఖలోని రామా టాకీస్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల సోమేష్ ఓ యువతిని ఇంటికి తీసుకురావడంతో తేజశ్రీ అతన్ని నిలదీసింది. దీనికి ఆగ్రహించిన సోమేష్ రూ.3 లక్షల విలువైన బైక్ కావాలని వేధించడం ప్రారంభించాడు. తేజశ్రీ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు బైక్‌ను కొనిచ్చారు.
బైక్ కొనిచ్చిన వారం రోజులకే, సోమేష్ మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. పది సెంట్ల భూమిని తన పేరున రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంపై తేజశ్రీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రూ.50 వేలు ఇచ్చారు. అయితే, పెళ్లి ఆల్బమ్‌లో మిగిలిన మొత్తం రూ.1.50 లక్షలు అడగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత తేజశ్రీ స్పందించకపోవడంతో, ఉదయం 9.30 గంటలకు సోమేష్ తన స్నేహితుడితో ఫోన్ చేయించి, తేజశ్రీ ఉరివేసుకుని చనిపోయిందని చెప్పించాడు. కుటుంబ సభ్యులు విశాఖపట్నం చేరుకునేసరికి, కుమార్తె బెడ్‌పై విగతజీవిగా పడి ఉంది. ఆమె మెడ, కాళ్లపై వాతలు కనిపించాయని, సోమేష్ స్నేహితులు అక్కడే ఉండటంతో తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు త్రీటౌన్‌లో కేసు నమోదు చేయగా, పోలీసులు సోమేష్‌ను అరెస్టు చేశారు.











