మోసపూరిత జీఎస్టీ లావాదేవీల ద్వారా సుమారు రూ.100 కోట్ల నగదు అక్రమ రవాణా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ పరిశ్రమల శాఖా మంత్రి సంజీవ్ అరోరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేసింది. ఈ కేసులో భాగంగా మంత్రి అధికారిక నివాసంతో సహా పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, మంత్రి సంజీవ్ అరోరాకు సంబంధించిన వ్యక్తులు నకిలీ కంపెనీల సహాయంతో మొబైల్ ఫోన్ కొనుగోళ్ల పేరుతో నకిలీ బిల్లులను సృష్టించారు. ఈ బిల్లులను ఉపయోగించుకుని అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, జీఎస్టీ రీఫండ్స్, ఇతర ఎగుమతి ప్రయోజనాలను పొందారు.
ఈ విధంగా అక్రమంగా సంపాదించిన నగదును దుబాయ్‌కు తరలించి, తిరిగి భారతదేశానికి తీసుకువచ్చి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో, ఈడీ అధికారులు ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్‌లలోని మంత్రి అధికారిక నివాసంతో పాటు ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ అరెస్టు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు ఈ అరెస్టును ఖండించారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారానికి ఉపయోగిస్తోందని ఆరోపించారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ, ఈ దాడుల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని, బీజేపీలో చేరమని ఒత్తిడి తెచ్చేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.







