ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా నావికా దిగ్బంధనాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 15 యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లతో కూడిన భారీ సైనిక బలగాలను మోహరించింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించిన సమాచారం ప్రకారం, ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చే, అక్కడి నుంచి వెళ్లే అన్ని నౌకలకు ఈ దిగ్బంధనం వర్తిస్తుంది. అయితే, ఇతర దేశాల ఓడరేవులకు వెళ్లే నౌకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని అమెరికా స్పష్టం చేసింది. తగిన గుర్తింపు, అనుమతి లేకుండా జలసంధిలోకి ప్రవేశించే నౌకలను అడ్డుకుంటామని, దారి మళ్లించడమో లేక స్వాధీనం చేసుకోవడమో జరుగుతుందని హెచ్చరించింది.
ప్రపంచంలోని ముడి చమురు, ఎల్ఎన్జీలో దాదాపు 20 శాతం ఈ జలసంధి నుంచే రవాణా అవుతుంది. ఈ దిగ్బంధనం ద్వారా ఇరాన్ ఆదాయానికి గండి కొట్టాలని అమెరికా యోచిస్తోంది. దిగ్బంధనం ప్రారంభమైన తర్వాత రెండు నౌకలు వెనక్కి మళ్లినట్లు షిప్-ట్రాకింగ్ డేటా ద్వారా తెలిసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ దిగ్బంధనం వైపు వచ్చే ఇరాన్ ఫాస్ట్-ఎటాక్ నౌకలను ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. "ఇప్పటికే ఇరాన్‌కు చెందిన 158 నౌకలు సముద్ర గర్భంలోకి చేరాయి. మా దిగ్బంధనం వద్దకు వస్తే మిగతావాటిని కూడా తుడిచిపెట్టేస్తాం" అని ఆయన సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు.
ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమైన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ దిగ్బంధనాన్ని ప్రకటించడం గమనార్హం. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేనందువల్లే చర్చలు విఫలమయ్యాయని ఆయన తెలిపారు. ఈ పరిణామం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.











