పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దుబాయ్లో విషాదకరమైన దృశ్యాలకు దారితీస్తున్నాయి. ఇరాన్ దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్న ప్రవాసులు, తమతో పాటు ఇన్నాళ్లుగా ఉన్న పెంపుడు జంతువులను వీధుల్లో వదిలి వెళుతున్నారు. ఈ పరిస్థితి అనేక జంతువులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.
యజమానులు తమ కుక్కలను స్తంభాలకు కట్టేసి, ఆహారం, నీరు అందించకుండా వెళ్లిపోవడంతో అవి ఆక్రందనలు చేస్తున్నాయి. మరికొందరు పిల్లులను పెట్టెల్లో పెట్టి, వాటిపై 'మమ్మల్ని క్షమించండి, వీటిని తీసుకెళ్లడం మా వల్ల కాదు' అని రాసి రోడ్ల పక్కన వదిలివేస్తున్నారు. కొందరు ప్రవాసులు పెంపుడు జంతువులను తరలించే ఖర్చు భరించలేక, వాటికి విషం ఇచ్చి చంపేయాలని పశువైద్యులను కోరుతున్నట్లు సమాచారం.
రోడ్డు మార్గంలో ఒమన్ సరిహద్దులకు చేరుకుంటున్నవారు, అక్కడ జంతువులకు అనుమతి లేకపోవడంతో వాటిని ఎడారిలోనే వదిలి వెళుతున్నారు. భగభగమండే ఎండలో ఆహారం లేక అవి అలమటిస్తున్నాయి. జంతు సంరక్షణ కేంద్రాలు ఇప్పటికే నిండిపోవడంతో కొత్తగా వచ్చే జంతువులను చేర్చుకోవడం భారంగా మారింది.
దుబాయ్ మున్సిపాలిటీ వీధి జంతువుల కోసం ఏర్పాటు చేసిన 'ఎహ్సాన్ స్టేషన్' (ఆహారం అందించే స్మార్ట్ మెషీన్లు) కూడా పెరుగుతున్న ఈ సంఖ్యకు సరిపోవడం లేదని స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రోజుకు వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని, పరిస్థితి చేయి దాటిపోతోందని వారు తెలిపారు.
ఈ అమానవీయ సంఘటనలు అంతర్జాతీయంగా విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రాణం కంటే ప్రేమ చిన్నదైపోయిందన్నట్లుగా సాగుతున్న ఈ పరిణామాలు జంతు ప్రేమికులను కలచివేస్తున్నాయి.

