కొడుకు పుట్టాలనే తీవ్రమైన కోరికతో, తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమార్తెలకు విషం పెట్టి చంపి, తాము ఫుడ్ పాయిజనింగ్ బారిన పడినట్లు నాటకం ఆడిన దారుణ ఘటన అహ్మదాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
ఏప్రిల్ 1న అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విమల్ ప్రజాపతి, అతని భార్య భావన తమ ఇద్దరు కుమార్తెలు మిశ్రీ (4 ఏళ్లు), రాహా (3 నెలలు)తో కలిసి దోశలు తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చేర్పించగా, ఇద్దరు బాలికలు మరణించారు.
పోలీసులకు మొదట ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసుగా అనిపించినా, దర్యాప్తులో కొన్ని అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా, మూడు నెలల పసికందుకు దోశలు తినిపించడం, తల్లిదండ్రులు మాత్రమే అస్వస్థతకు గురికావడం వంటి అంశాలు వారిని ఆలోచింపజేశాయి.
తల్లి భావన రాసుకున్న డైరీలో కొడుకు కావాలనే కోరిక గురించి రాయడం, అలాగే ఇంట్లో 'అల్యూమినియం ఫాస్ఫైడ్' (సల్ఫాస్) విషం దొరకడం పోలీసుల అనుమానాలను బలపరిచాయి. విమల్ ప్రజాపతి ఈ విషాన్ని కొనుగోలు చేసినట్లు, అయితే దాని లెక్క సరిపోలడం లేదని తేలింది.
ప్రాథమిక విచారణ ప్రకారం, తల్లిదండ్రులు తమ కుమార్తెలకి విషం పెట్టి చంపి, తాము కూడా కొద్దిగా విషం తీసుకుని ఫుడ్ పాయిజనింగ్ నాటకం ఆడినట్లు పోలీసుల నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.











