జార్ఖండ్ రాష్ట్రంలోని సరంద అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు మిస్సిర్ బిస్రా ఈ ప్రాంతంలో తలదాచుకున్నాడనే సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
మావోయిస్టులు, జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గత కొద్దిరోజులుగా భద్రతా బలగాలు ఈ అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ ఆపరేషన్లో భారీ సంఖ్యలో జవాన్లు పాల్గొని మావోయిస్టుల కోసం గాలిస్తున్నారని సమాచారం. భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పుల ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.







