ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలోని ఇష్ట జూనియర్ కాలేజ్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకొని రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ మార్కులు సాధించి, కళాశాలకు మంచి పేరు తెచ్చారు.
కళాశాల డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు.
ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో జి.సాయి వెంకట్ 991 మార్కులతో, మురళీ కిరణ్ 989 మార్కులతో పాటు పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 950 పైగా మార్కులతో 42 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బైపీసీ విభాగంలో కె.వైష్ణవి 990 మార్కులు సాధించగా, ఎనిమిది మంది విద్యార్థులు 950 పైగా మార్కులు సాధించారు.
సీఈసీ, ఎంఈసీ విభాగాల్లోనూ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఫుర్కాన్ ఉర్ రహ్మాన్ 946 మార్కులతో, జె.నందిని యాదవ్ 969 మార్కులతో అగ్రస్థానాల్లో నిలిచారు. ప్రథమ సంవత్సరంలోనూ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ విభాగాల్లో విద్యార్థులు ఆకట్టుకునే మార్కులు సాధించారు. ముఖ్యంగా, ఐఐటీ జేఈఈ మెయిన్స్ సెషన్-1లో 24 మంది విద్యార్థులు అర్హత సాధించడం విశేషం.
కళాశాల డైరెక్టర్ వినోద్ కుమార్ భవిష్యత్తులోనూ మరిన్ని ఉన్నత ఫలితాలు సాధించేందుకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.












