అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ గట్టిగా స్పందించింది. తమ సైనిక సామర్థ్యాలు దెబ్బతినలేదని, అమెరికా లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ హెచ్చరించింది.
అమెరికా తమకు లొంగిపోయేవరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ నౌకాదళం, వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయని, వారి నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది.
ట్రంప్ చెప్పినట్లుగా తమ సైనిక సామర్థ్యాలు దెబ్బతినలేదని, అమెరికా అవమానానికి గురై, పశ్చాత్తాపపడి, లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ మిలిటరీ కమాండ్ ప్రధాన కేంద్రం అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటనను ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది.
తమ దేశ సైనిక బలం, విస్తృతమైన వ్యూహాత్మక సామర్థ్యాల గురించి అమెరికా నిఘా వర్గాలకు పూర్తి సమాచారం లేదని ఇరాన్ పేర్కొంది. వ్యూహాత్మక క్షిపణులు, సుదూర లక్ష్యాలను ఛేదించే డ్రోన్లు, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, ప్రత్యేక ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలతో పాటు సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని ట్రంప్ చేసిన వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది.
అమెరికా రాతి యుగం నాటి నేరాలను ఆధునిక యుగానికి తీసుకువస్తోందని, చిన్నారుల హత్యలు, మానవత్వానికి మచ్చ తెచ్చే నేరాలకు పాల్పడుతోందని ఇరాన్ ఆరోపించింది. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.











