ఇందూరు (ప్రశ్న ఆయుధం) ఆగస్టు 03
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన సమీక్షలో ఈ అంశంపై చర్చించారు.
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ విస్తృతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.
మల్టీ స్పెషాలిటీ సౌకర్యాలు
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజూ రెండు వేల మందికిపైగా రోగులు ఓపీ సేవలు పొందుతున్నందున, ఆ స్థాయికి తగిన మల్టీ స్పెషాలిటీ వైద్య సౌకర్యాలు కల్పించడం అత్యవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఎంఆర్ఐ యంత్రంతో పాటు ఆధునిక మార్చురీ ఫ్రీజర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆక్సిజన్ ప్లాంట్
ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ సమర్థంగా పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
సివిల్ పనులు, పోస్టుల భర్తీ
అలాగే ఆసుపత్రిలో కొనసాగుతున్న సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, చికిత్స కోసం వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సమావేశంలో సూచించినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో సివిల్ సర్జన్లు, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్లు, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
వినతిపత్రం అందజేత
సమావేశం అనంతరం ఆసుపత్రి అవసరాలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు అందజేశారు.











