సంగారెడ్డి, జూలై 28
జిల్లాలో ప్రసవాల సమయంలో మాతృ, శిశు మరణాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యాధికారులను ఆదేశించారు. గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందించి, మరణాలను పూర్తిగా నివారించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలో ప్రసవాల సందర్భంగా మాతృ, శిశు మరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటుచేసుకోకుండా అన్ని స్థాయిల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యాధికారులను ఆదేశించారు. గర్భిణులకు గర్భధారణ ప్రారంభ దశ నుంచే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించడం ద్వారా మాతృ, శిశు మరణాలను పూర్తిగా నివారించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాతృ, శిశు మరణాల ఆడిట్‌తో పాటు జిల్లాలో గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం–1994 అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవల నమోదైన ప్రతి మాతృ, శిశు మరణ ఘటనను కేసు వారీగా పరిశీలించారు.
ఏ ఆసుపత్రిలో ఘటన చోటుచేసుకుంది, మరణానికి దారితీసిన కారణాలు ఏమిటి, వైద్య సేవలలో ఎక్కడైనా నిర్లక్ష్యం లేదా లోపాలు జరిగాయా అనే అంశాలపై సంబంధిత వైద్య సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. వైద్య రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన నివారణ చర్యలను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా జిల్లాలో PC&PNDT చట్టం–1994ను కట్టుదిట్టంగా అమలు చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిగా అరికట్టేందుకు నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, ప్రోగ్రామ్ ఆఫీసర్ (ఎంసీహెచ్) డాక్టర్ నాగలక్ష్మి, డాక్టర్ శశాంక్, సంబంధిత వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.












