యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో 'యూత్ లీడర్షిప్ సమ్మిట్ – లీడ్ విత్ విజన్ & ఇన్స్పైర్ ది ఫ్యూచర్' కార్యక్రమం బుధవారం కామారెడ్డి SETWIN సెంటర్లో విజయవంతంగా జరిగింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న యువజన & క్రీడా వారోత్సవాలలో భాగంగా ఈ సమ్మిట్ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి శ్రీ లాలు నాయక్, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు డా. జైపాల్ రెడ్డి, ఆర్కే కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ నవీన్, SETWIN కోఆర్డినేటర్ వినోద్, యువజన సేవా శాఖ సిబ్బంది, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
సమ్మిట్లో వక్తలు యువతలో నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సాధికారత, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించారు. సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు.
దేశ భవిష్యత్తులో యువకుల పాత్ర, సెల్ ఫోన్ల ప్రభావం వంటి అంశాలపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ముసాలిన్ సుధామ్స్ ఉపన్యాస పోటీలో మొదటి బహుమతి సాధించారు. జిల్లా యువజన & క్రీడల శాఖ అధికారులు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందని తెలిపారు.












