జహీరాబాద్‌లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (ఎస్ఐహెచ్ఎం)ను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేయడానికి రూ.5 కోట్లు మంజూరు చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ సందర్భంగా బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులతో పాటు, బీబీఏ, ఎంబీఏ అడ్మిషన్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఎస్ఐహెచ్ఎంలో నిర్వహించిన పర్యాటక వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులను ప్రారంభించారు. నిథమ్ (NITHM) విద్యా సంవత్సరానికి సంబంధించిన బీబీఏ, ఎంబీఏ కోర్సుల అడ్మిషన్లను కూడా లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, సుదీర్ఘ కాలంగా నిరుపయోగంగా ఉన్న ఎస్‌ఐహెచ్‌ఎంను పునః ప్రారంభించుకోవడం సంతోషదాయకమని తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి, స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్థను దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. ఎస్ఐహెచ్ఎంలో చేరిన పేద విద్యార్థులకు ఆర్థిక భారం పడకుండా స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రైవేట్ రంగంలో పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, యువత పర్యాటక, ఆతిథ్య రంగాలపై దృష్టి సారించాలని సూచించారు.
విద్యార్థులు భాషా నైపుణ్యాలను, విదేశీ భాషలను నేర్చుకోవాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా ఆధునిక కోర్సులను కరిక్యులమ్‌లో చేర్చాలని నిథమ్ డైరెక్టర్ వెంకట రమణను మంత్రి ఆదేశించారు. పిల్లల ఉపాధి కోర్సుల విషయంలో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని కోరారు.











