ప్రతి ఒక్కరూ తమ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా పిల్లలకు అన్ని చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండల కేంద్రంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి బి.సౌజన్య ఝరాసంగం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో న్యాయ అవగాహనపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బి.సౌజన్య మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, పిల్లలకు అన్ని చట్టలపైనా అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా బాల్యవివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు. పాక్సో యాక్ట్ ద్వారా బాలలపై జరిగే లైంగిక నేరాలకు కఠినమైన శిక్షలు విధించబడుతున్నాయని వివరించారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా కుటుంబంలో మహిళలు ఎదుర్కొనే హింసకు చట్టపరమైన రక్షణ లభిస్తుందని తెలిపారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాలు వంటి సమస్యల నుండి మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలాంటి అన్యాయం జరిగినా మహిళలు భయపడకుండా చట్టపరమైన సహాయం పొందాలని, వృద్ధుల సంరక్షణ బాధ్యత పిల్లలదే అని అన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, అందరు క్రమశిక్షణగా ఉండాలని అన్నారు.
గ్రామంలో ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, ఏదైనా న్యాయ సహాయం కోరినచో జిల్లాలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు మండల కేంద్రాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయాలను సంప్రదించాలని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 15100కు కూడా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, మండల ప్రజా పరిషత్ అధికారి, బాలల సంరక్షణ అధికారి, అంగన్వాడి, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.












