కత్బుల్లాపూర్ ప్రాజెక్ట్ జగద్గిరిగుట్ట సెక్టార్ శివ నగర్-2 అంగన్వాడీ సెంటర్లో పి&జి ప్రథమ్ ఆధ్వర్యంలో పాఠశాల సంసిద్ధత మేళా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పిల్లల సమగ్ర వికాసంపై దృష్టి సారించారు.
జగద్గిరిగుట్ట సెక్టార్ సూపర్వైజర్ శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో, అంగన్వాడీ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని, ఆటలు, పాటల ద్వారా విద్యను అందిస్తున్నాయని తెలిపారు.
పిల్లల శరీరక, భాషా, బుద్ధి, పూర్వ గణిత, సామాజిక, భావోద్వేగ వికాసం అనే ఐదు కీలక అంశాలు వారి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని శ్రీదేవి వివరించారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో లభించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అంగన్వాడీ టీచర్ గుండ్ర శ్రీలత, మాస్టర్ ట్రైనర్ తిమ్మప్ప, టీచర్ రమా ఆధ్వర్యంలో పిల్లలకు వివిధ రకాల ఆటలు, పాటలు, కథలు, పూర్వ గణిత భావనలపై కార్యకలాపాలు నిర్వహించారు. దాదాపు 40 మంది పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించి తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ప్రోగ్రెస్ రిపోర్టు కార్డులను అందజేయడంతో పాటు, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించి, పిల్లలను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ రమణమ్మ, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











