తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు 'ఆపరేషన్ ఆక్టోపస్' పేరుతో చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, విదేశాల నుంచి మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ కు మ్యూల్ అకౌంట్లు సమకూరుస్తున్న 117 మందిని అరెస్ట్ చేశారు. వీరి ఖాతాల ద్వారా సుమారు 139 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ అరెస్టులు జరిగాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులు, ఓటీపీ ఫ్రాడ్, సోషల్ మీడియా మోసాలకు సంబంధించిన కేసులు ఇందులో ఉన్నాయి. అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, అరెస్ట్ అయిన నిందితులకు 1,081 కేసులతో సంబంధం ఉందని, వారి నుంచి భారీ మొత్తంలో నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, చెక్ బుక్కులు, సిమ్ కార్డులు, డెబిట్ కార్డులు, షెల్ కంపెనీల స్టాంపులు, పాస్ బుక్కులు వంటివి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గత నెలలో జోనల్ సైబర్ సెల్స్ కు వచ్చిన 2,963 పిటిషన్లలో 461 కేసుల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఈ కేసుల్లో 11 మందిని అరెస్ట్ చేసి, బాధితులకు 24.10 లక్షల రూపాయలను రీఫండ్ చేశారు. మొత్తంగా, గత నెలలో 34.76 లక్షల రూపాయలను బాధితులకు తిరిగి చెల్లించారు.
సైబర్ పోలీసులు నిరంతరాయంగా సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ, ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న 124 ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం ప్రొఫైళ్లను గుర్తించి, వాటిలో 124 ప్రొఫైళ్లను తొలగించారు. యువతను బెట్టింగ్, గేమింగ్ వైపు ఆకర్షితులను చేస్తున్న ఈ ప్రొఫైళ్లపై చర్యలు తీసుకున్నారు.
సైబర్ మోసాలకు గురైనవారు వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని అదనపు కమిషనర్ శ్రీనివాసులు సూచించారు. సీ మిత్ర ద్వారా 2,396 మంది బాధితులకు ఫిర్యాదుల నమోదులో మార్గదర్శకత్వం అందించగా, 257 జీరో ఎఫ్ఐఆర్ లను జారీ చేశారు.

