విధి నిర్వహణలో విశిష్ట సేవలు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ముగ్గురు పోలీసు సిబ్బందికి "డీజీపీ కమెండేషన్ డిస్క్- 2026" అవార్డులను ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ ప్రకటించింది. ఈ అవార్డులను డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా అందజేశారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా, మార్చి 7న విజయవాడలో జరిగిన సంఘటనలో, కనకం మురళి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ముద్దాయి తుపాకీతో దాడికి యత్నించినా, సాంకేతిక లోపం వల్ల అది ఫైర్ కాలేదు.
తప్పించుకునే ప్రయత్నంలో జనాలను కాల్చివేస్తానని బెదిరించిన ముద్దాయిని, ప్రాణాలను లెక్కచేయకుండా ఎం. కృష్ణకుమార్, ఎం.వి. సారధి నాయక్, పి. మనోహర్ లు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి సేవలను డీజీపీ అభినందించారు.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, పోలీసుల ధైర్య సాహసాలు, నిబద్ధత అభినందనీయమని, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

