తిరుపతి దర్శనం టిక్కెట్లు బుక్ చేస్తానని చెప్పి, ఒక విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.18.46 లక్షలు మోసపూరితంగా బదిలీ చేసుకున్న ఆలయ పూజారిపై కేసు నమోదైంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్వారం గ్రామంలో జరిగింది.
స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి రోజూ దర్శనానికి వెళ్లే ఒక విశ్రాంత ఉద్యోగితో సాయి తరుణ్ అనే పూజారి పరిచయం పెంచుకున్నాడు. తిరుపతి దర్శనం, రైలు టిక్కెట్లు బుక్ చేస్తానని నమ్మించి, బాధితుడి ఫోన్ తీసుకున్న పూజారి, పాస్వర్డ్ తెలుసుకుని, మెసేజ్‌లు తనకు వచ్చేలా సెట్టింగ్‌లు మార్చినట్లు ఆరోపణలున్నాయి.
ఆ తర్వాత, తిరుపతి దర్శనం టిక్కెట్ల పేరుతో, బాధితుడి ఫోన్‌ను ప్రతిరోజూ తీసుకుని, అతని ఖాతా నుండి 30 విడతల్లో దాదాపు రూ.18.46 లక్షలను దామెర హరీష్ అనే వ్యక్తి ఖాతాకు బదిలీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బ్యాంకు ఖాతాలో డబ్బులు లేవని అధికారులు చెప్పడంతో, స్టేట్మెంట్ తీసి చూసిన బాధితుడు, ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు రూ.99,999 చొప్పున డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు హరీష్‌ను అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న పూజారి సాయి తరుణ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

