శేరిలింగంపల్లికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, హోప్ ఫౌండేషన్ మరియు తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ను ఢిల్లీ ఆదాయపు పన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద ఉన్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. సుమారు 12 గంటల పాటు జరిగిన విచారణ అనంతరం, అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లడానికి అనుమతించిన అధికారులు, అనంతరం మళ్లీ విచారణకు హాజరు కావాలని సూచించారు.
న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు కొండ విజయ్ కుమార్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరారు. ఈ క్రమంలో, గురువారం సాయంత్రం స్థానిక ఆదాయపు పన్ను అధికారులు ఆయనను అడ్డుకుని, పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే, అక్కడి ఆదాయపు పన్ను అధికారులు నలుగురు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
అధికారుల విచారణలో భాగంగా, కొండ విజయ్ కుమార్ ఒంటిపై ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, ఆయన పేరుతో ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
సుమారు 12 గంటల పాటు జరిగిన విచారణ అనంతరం, అధికారులు కొండ విజయ్ కుమార్ ను అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లడానికి అనుమతించారు. అయితే, కార్యక్రమం అనంతరం మళ్లీ విచారణకు హాజరు కావాలని సూచించినట్లు తెలిసింది. అధికారులు సీజ్ చేసిన బంగారాన్ని తిరిగి అప్పగిస్తారా లేదా అన్నది ఆయన ఆదాయపు పన్ను చెల్లింపుల వివరాలపై ఆధారపడి ఉంటుందని సమాచారం.
ఈ పరిణామంతో కొండ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











