ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు పొందిన సయీదా బేగం అనే మహిళ, ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నట్లు విజయవాడ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో ఉగ్రవాదులు ఆమెను తమ వలలోకి లాగినట్లు సమాచారం.
సాధారణ గృహిణిగా జీవితం ప్రారంభించి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందిన సయీదా బేగం (38), ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలలో చిక్కుకుంది. పాతబస్తీ చంచల్‌గూడకు చెందిన ఆమె, తెలియక ఉగ్రవాదుల వలలో పడిందా లేక వలపు వలకు బలైందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో విజయవాడకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న సయీదా, భర్త వేధింపుల కారణంగా ఏడాది క్రితం కుమారుడితో కలిసి పుట్టింటికి వచ్చింది. ఇళ్లలో పనులు చేస్తూనే, తనలోని ప్రతిభను రీల్స్ రూపంలో పోస్ట్ చేయడం ప్రారంభించింది. అనతికాలంలోనే 30 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.
తల్లి ఒత్తిడితో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సయీదా, ఇన్‌స్టాగ్రామ్‌లో తోడు కావాలంటూ పోస్ట్ చేసింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న విజయవాడకు చెందిన ఒక ఉగ్రవాది, తాను పోలీసునని నమ్మించి, ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె సోషల్ మీడియా ప్రభావాన్ని గమనించి, తమ ఉగ్రవాద సందేశాలను ప్రచారం చేయడానికి ఉపయోగించుకున్నాడు.
విదేశీ హ్యాండ్లర్ మార్గదర్శకత్వంలో, సయీదా 7 రాష్ట్రాలకు చెందిన 42 మందితో ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, తీవ్రవాద ప్రచారాన్ని ముమ్మరం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె కార్యకలాపాలపై నిఘా ఉంచిన పోలీసులు, ఇటీవల ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు, ఆమె కొన్ని మెసేజ్‌లు, రీల్స్‌ను డిలీట్ చేసినట్లు సమాచారం.







