మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో అర్థరాత్రి మద్యం మత్తులో భర్త తన భార్యపై కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో బాధితురాలి తలకు బలమైన గాయమైంది.
వివరాల్లోకి వెళితే, మండల కేంద్రానికి చెందిన శివరాత్రి శైలజ (45) కు ఆమె భర్తతో కొన్నాళ్లుగా గృహ కలహాలున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి సుమారు 1 గంట సమయంలో, భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చి, భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భర్త, కర్రతో శైలజపై దాడి చేశాడు.
ఈ దాడిలో శైలజ తలకు తీవ్ర గాయం కావడంతో అధిక రక్తస్రావం అయింది. బాధితురాలి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పైలట్ గోవర్ధన్ మరియు ఈఎంటీ రాంబాబులు బాధితురాలికి తక్షణమే ప్రథమ చికిత్స అందించి, రక్తస్రావాన్ని అడ్డుకున్నారు.
108 సిబ్బంది సత్వర స్పందనతో బాధితురాలి ప్రాణాపాయం తప్పినట్లు తెలిసింది. ఆమె ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
గృహ హింసకు సంబంధించిన ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భర్త మద్యం అలవాటు మరియు ప్రవర్తన కారణంగా ఈ సంఘటన జరిగిందని కొందరు చెబుతున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.











