నిజామాబాద్, జూలై 26
నగరంలో పనిమనుషుల ద్వారా జరుగుతున్న దొంగతనాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంటి పనులకు నియమించుకునే ముందు వ్యక్తుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించకపోతే విలువైన ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివసించే విద్యార్థులు, వృద్ధులే లక్ష్యంగా నేరాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
నగరంలో ఇటీవల పనిమనుషుల ద్వారా జరుగుతున్న దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. తగిన వివరాలు తెలుసుకోకుండా ఇంటి పనులకు వ్యక్తులను నియమించుకోవడం వల్ల విలువైన ఆస్తులు కోల్పోయే ప్రమాదం ఉందని సూచించారు.
పనిమనుషులుగా చేరిన కొందరు నేరగాళ్లు యజమానుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని నగదు, బంగారం, విలువైన వస్తువులను చోరీ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా బిజీ జీవితాన్ని గడిపే ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివసించే విద్యార్థులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
గత రెండేళ్లలో నగరంలో పనిమనుషుల ద్వారా జరిగిన చోరీలకు సంబంధించి మొత్తం 565 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా జూబ్లీహిల్స్ జోన్లో 173 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన కొన్ని ముఠాలు పనిమనుషుల వేషంలో ఇళ్లలోకి ప్రవేశించి పథకం ప్రకారం నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు.
ఇళ్లతో పాటు కార్యాలయాలు, దుకాణాల్లో నగదు, బంగారం, విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా ఉంచడం వల్ల నేరాలకు అవకాశం కలుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో యజమానులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ భద్రతా సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు.
పనిమనుషులను నియమించుకునే ముందు వారి ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాల ప్రతులు, శాశ్వత చిరునామా, ఫోన్ నంబర్లను తప్పనిసరిగా సేకరించాలని పోలీసులు సూచించారు. ప్రైవేట్ ఏజెన్సీలు లేదా మధ్యవర్తుల ద్వారా నియామకాలు చేపడితే, సంబంధిత సంస్థకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు.
అలాగే, వారు గతంలో పనిచేసిన యజమానులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని, స్థానిక పోలీస్ స్టేషన్లో ఉచితంగా నిర్వహించే పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవడం భద్రతాపరంగా ఎంతో మేలు చేస్తుందని సూచించారు. ఇంట్లోని నగలు, నగదు, ప్రయాణ ప్రణాళికలు వంటి వ్యక్తిగత విషయాలను పనిమనుషుల సమక్షంలో చర్చించకూడదని పోలీసులు హెచ్చరించారు.












