నిజామాబాద్, 2026-07-26
ఒకప్పుడు జీవితంలో విడదీయరాని భాగంగా ఉన్న స్నేహబంధాలు నేడు క్రమంగా తగ్గిపోతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ‘స్నేహితుల కొరత’ ఆందోళనకర స్థాయికి చేరిందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేటి జీవనశైలి, టెక్నాలజీ ప్రభావం, తీరికలేని పనివేళలు, చిన్న కుటుంబాల పెరుగుదల వంటి కారణాలతో నిజమైన స్నేహాలు అరుదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఒక వ్యక్తికి అనేక మంది సన్నిహిత స్నేహితులు ఉండేవారు. అయితే కాలక్రమేణా ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది.
ఒకప్పుడు జీవితంలో విడదీయరాని భాగంగా ఉన్న స్నేహబంధాలు నేడు క్రమంగా తగ్గిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ‘స్నేహితుల కొరత’ ఆందోళనకర స్థాయికి చేరిందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేటి జీవనశైలి, టెక్నాలజీ ప్రభావం, తీరికలేని పనివేళలు, చిన్న కుటుంబాల పెరుగుదల వంటి కారణాలతో నిజమైన స్నేహాలు అరుదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గతంలో ఒక వ్యక్తికి అనేక మంది సన్నిహిత స్నేహితులు ఉండేవారు. అయితే కాలక్రమేణా ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా నిర్వహించిన సర్వేల ప్రకారం దేశంలో 12 శాతం మందికి చెప్పుకోదగ్గ స్నేహితుడు కూడా లేరని వెల్లడైంది. ఒకప్పుడు రోజుకు గంటకు పైగా స్నేహితులతో గడిపే సమయం ఉండగా, ప్రస్తుతం అది సగటున 35 నిమిషాలకు మాత్రమే పరిమితమైంది. మరోవైపు మొబైల్, సోషల్ మీడియా వినియోగం మాత్రం విపరీతంగా పెరిగింది.
మంచి స్నేహితులు ఉన్నవారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒంటరితనం అధిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే స్నేహితులతో కలిసి గడపడం వల్ల వ్యాయామం, వినోదం, సామాజిక చురుకుదనం పెరిగి గుండె సంబంధిత సమస్యలు తగ్గే అవకాశముందని పేర్కొంటున్నారు.
స్నేహం ఒక్కరోజులో ఏర్పడేదికాదని, దానికి సమయం కేటాయించాల్సిందేనని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒకరితో సన్నిహిత పరిచయం ఏర్పడాలంటే అనేక గంటలు కలిసి గడపాల్సి ఉంటుందని, నిజమైన స్నేహంగా మారేందుకు మరింత సమయం అవసరమని వివరిస్తున్నారు. ఏర్పడిన స్నేహాన్ని నిలబెట్టుకోవాలంటే కూడా తరచూ పలకరించడం, మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం అవసరమని సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో వేలాది మంది ‘ఫ్రెండ్స్’ ఉన్నా, ఆపదలో అండగా నిలిచే నిజమైన స్నేహితులు చాలా తక్కువగానే ఉంటారని నిపుణులు అంటున్నారు. ఉద్యోగ సంబంధాలు, సోషల్ మీడియా పరిచయాలు, సందర్భానుసార స్నేహాలు ఎక్కువగా అవసరాలకే పరిమితమవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
రోజుకు కొంత సమయం స్నేహితులతో మాట్లాడేందుకు కేటాయించడం, వారానికి ఒకసారి అయినా కలుసుకోవడం, కలిసినప్పుడు మొబైల్‌కు దూరంగా ఉండి మనస్పూర్తిగా సంభాషించడం, కొత్త పరిచయాలను ఆహ్వానించడం, చిన్న మనస్పర్థలను పక్కనపెట్టి పాత స్నేహాలను కాపాడుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.












