సంగారెడ్డి, జూలై 22
సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా పీసీఆర్, పీఓఏ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, చట్టాల అమలు సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
పీసీఆర్, పీఓఏ చట్టాలను జిల్లాలో మరింత సమర్థవంతంగా అమలు చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం, పీసీఆర్, పీఓఏ చట్టాల అమలుపై సమీక్షా సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో చోటుచేసుకునే ఎస్సీ, ఎస్టీలపై వివక్ష, అట్రాసిటీ ఘటనలను అత్యంత బాధ్యతాయుతంగా పరిగణించాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులోకి రాని వాస్తవ ఘటనలను రెవెన్యూ, పోలీసు అధికారులు గుర్తించి, వాస్తవమైన ప్రతి కేసును నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు. బాధితులకు చట్టప్రకారం అందాల్సిన రక్షణ, సహాయం, ఆర్థిక ఉపశమనం, న్యాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ప్రతి కేసులో బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తూ, చట్టప్రకారం సత్వర న్యాయం అందేలా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి జగదీష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ, ఏసీపీలు, డీఎస్పీలు, రెవెన్యూ డివిజనల్ అధికారులు రాజేందర్, దేవుజ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.












