మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలకు సంబంధించిన వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు, ట్రైబల్ వాచర్ల ప్రమేయంపై సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి.
అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల్లో లంకెబిందెలు బయటపడ్డాయన్న సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఒక గుప్తనిధుల ముఠా ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు తవ్వకాలు జరిపి, లంకెబిందెలలోని సొమ్మును స్వాహా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
తురిమెళ్ళ అటవీ క్షేత్ర స్థాయి అధికారులు, ట్రైబల్ వాచర్లతో కలిసి ఈ తవ్వకాలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. రెండు పెద్ద మట్టి కుండలు బయటపడ్డాయని, వాటిలో బంగారం, వజ్రాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నిధులను హైదరాబాద్లో అమ్మే ప్రయత్నం విఫలమయ్యాక, బెంగళూరులో విక్రయించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సుమారు నెల రోజుల క్రితం యర్రకుంట్ల సమీపంలో ఈ తవ్వకాలు జరిగినట్లు భావిస్తున్నారు. వెలగలపాయ ఫారెస్ట్ బీట్ అధికారికి, కొందరు గుప్తనిధుల ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. గుప్తనిధుల కుండలు వెలికితీసినట్లు చెబుతున్న వీడియోలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందడంతో, వారు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. పోలీసుల విచారణలో ఈ తవ్వకాల వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ఆరోపణలపై అటవీశాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.











