అమీర్‌పేటలోని ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై భవనం ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తూ దాడి జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకుడు బొంతు రామ్మోహన్, ఆయన కుటుంబ సభ్యులు హాస్టల్ నిర్వాహకుల నుండి రూ. 2 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకొని భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లు సమాచారం.
అయితే, అకస్మాత్తుగా భవనాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తూ, హాస్టల్ నిర్వాహకులపై దాడి చేసి, చిత్రహింసలకు గురి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో బొంతు రామ్మోహన్ అత్త, పోలీసుల సమక్షంలోనే హాస్టల్ నిర్వాహకురాలిని జుట్టు పట్టుకొని కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తమ డబ్బులు అన్యాయంగా తీసుకొని, భవనాన్ని ఖాళీ చేయమని కొడుతున్నారని, అక్రమ కేసులు బనాయించి పోలీసులను పంపించి భయపెడుతున్నారని హాస్టల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో కలిసి హాస్టల్లో కూర్చొని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, నగరం నడిబొడ్డున జరుగుతున్న ఈ అరాచకాన్ని అరికట్టాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
ఈ ఘటనపై పోలీసుల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బాధితులు తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.











