కామారెడ్డి, 2026-06-30
గంజాయి అక్రమ రవాణా కేసులో కామారెడ్డి పోలీసులు కీలక పురోగతి సాధించారు. పరారీలో ఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఒడిశాలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12 కిలోల గంజాయి, రూ.6 లక్షల విలువైన సరకు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి అక్రమ రవాణా కేసులో కామారెడ్డి పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇటీవల జాతీయ రహదారిపై పనస పండ్ల లోడులో గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసిన కేసులో పరారీలో ఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేక బృందాల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందాలు ఒడిశాలోని కంధమాల్ జిల్లా సారంగఢ మండలం గుంజిబాడి గ్రామానికి వెళ్లి నిందితులు రాజు అలియాస్ రాజ్ కిషోర్ ప్రధాన్, దీపక్ అలియాస్ దీపక్ ప్రధాన్‌లను అరెస్టు చేశాయి.
నిందితుల వద్ద నుంచి 12 కిలోల గంజాయి, సుమారు రూ.6 లక్షల విలువైన సరకుతో పాటు నేరాలకు ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ట్రాన్సిట్ వారెంట్‌పై కామారెడ్డికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, మాదకద్రవ్యాల సాగు, రవాణా, విక్రయాలపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత కామారెడ్డిని నిర్మించడమే పోలీసు శాఖ లక్ష్యమని ఆయన తెలిపారు.












