ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీలకు చెందిన 10 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి.
ఏసీబీ అధికారులు మల్లారెడ్డికి చెందిన నాలుగు నివాస గృహాలు, ఒక వాణిజ్య భవనాన్ని గుర్తించారు. దీంతో పాటు ఎనిమిది ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు వెల్లడైంది. సోదాల్లో రూ.3.31 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.50 లక్షల నిల్వలు స్వాధీనం చేసుకున్నారు.
మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేర్లపై మూడు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వాటిని తెరిచి పరిశీలించిన తర్వాత మరిన్ని ఆస్తుల వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
సోదాల్లో ఒక గ్రాండ్ విటారా కారు, ఒక టీవీఎస్ స్కూటీ కూడా గుర్తించారు. ఇప్పటివరకు లభ్యమైన ఆస్తుల అధికారిక విలువ సుమారు రూ.3 కోట్లుగా అంచనా వేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడిని హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.












