కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం, జిల్లా న్యాయ విభాగం సంయుక్తంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడిన సైబర్ నేర బాధితులకు ప్రభుత్వ తరఫున 'లీగల్ ఎయిడ్ అడ్వకేట్' సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు కోల్పోయిన వారు, ప్రైవేట్ న్యాయవాదులను సంప్రదించే స్థోమత లేనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బాధితులు తమ సొమ్మును తిరిగి పొందే ప్రక్రియలో భాగంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఉచిత న్యాయ సహాయం ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ అయిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు ఇది దోహదపడుతుంది.
ఈ సేవలను పొందాలనుకునేవారు టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. లేదా తమ సమీప పోలీస్ స్టేషన్, జిల్లా సైబర్ క్రైం సెల్‌ను సంప్రదించవచ్చని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.


