ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను కోరారు. అమరావతిలో నిర్మిస్తున్న 'జస్టిస్ సిటీ'ని దేశంలోనే అత్యుత్తమ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు న్యాయ వ్యవస్థ సహకారం ఆకాంక్షించారు.
విజయవాడలో ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు సీఎం చంద్రబాబు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సాదర స్వాగతం పలికారు.
రాజధాని నిర్మాణంలో భాగంగా జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు సీఎం వివరించారు. జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి కీలక విభాగాలన్నింటినీ ఒకే చోట అనుసంధానిస్తూ బెస్ట్ జ్యుడిషియల్ సిటీని నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూములను కేటాయించేందుకు, ఇతరత్రా పూర్తి సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీజేఐకి భరోసా ఇచ్చారు.
సమాజంలో మధ్యవర్తిత్వం ద్వారా సత్వర న్యాయం అందాల్సిన ఆవశ్యకతను సీఎం నొక్కిచెప్పారు. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసు పరిష్కారమైతే రూ.10 వేలు, ఒకవేళ పరిష్కారం కాకపోయినా ఆ ప్రక్రియలో పాల్గొన్నందుకు రూ.3 వేలు అందిస్తామని ప్రకటించారు. న్యాయం త్వరగా జరిగితేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని, అందుకే ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రభుత్వానికి భారం కాదని అభిప్రాయపడ్డారు.

