మెదక్ జిల్లా చేగుంటలో డబ్బుల కోసం భార్యను పరాయితో కొట్టి హత్య చేసిన కేసులో భర్తను రామాయంపేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2015లో వరలక్ష్మికి ముఠా త్రిమూర్తులతో రెండో వివాహం జరిగింది. వివాహం తర్వాత నిందితుడు చేగుంటలో నివాసం ఉంటున్నాడు. వీరికి దుర్గాప్రసాద్ (10) అనే కుమారుడు ఉన్నాడు. రెండు సంవత్సరాల క్రితం కుటుంబ పోషణ కోసం వరలక్ష్మి కాళ్లకల్ ఐటీసీ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఈ సమయంలో నిందితుడు ఇంటి వద్దనే ఉంటూ, భార్యను డబ్బుల కోసం వేధించేవాడని సమాచారం.
తరచూ జరిగే గొడవలతో వరలక్ష్మిపై ద్వేషం పెంచుకున్న నిందితుడు, ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. ఫిబ్రవరి 21 అర్ధరాత్రి, భార్యాకొడుకులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న పరాయితో వరలక్ష్మి తలపై దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమె వద్ద ఉన్న 39.55 గ్రాముల బంగారు పుస్తెలతాడు, రూ.5,000 నగదు, సెల్‌ఫోన్‌ను తీసుకుని అన్నవరం పారిపోయాడు.
నమ్మదగిన సమాచారం మేరకు వెంకట రాజా గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం నిఘా ఏర్పాటు చేసి, మార్చి 1 ఉదయం చేగుంట బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి బంగారు పుస్తెలతాడు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు బృందాన్ని మెదక్ జిల్లా ఎస్పీ అభినందించారు. డబ్బుల కోసం కుటుంబాన్ని నాశనం చేసిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.

