ఆర్మూర్ పట్టణంలో జరిగిన భారీ దొంగతనం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 31.48 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఐపీఎస్., తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 24న ఆర్మూర్ పట్టణంలో జరిగిన 41.31 లక్షల రూపాయల విలువైన దొంగతనం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో A1గా ఉన్న విజయ్ అగర్వాల్, A2గా ఉన్న సల్మాన్ ఖాన్, A3గా ఉన్న మంజల్ సాయి కుమార్ లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 31,48,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
విజయ్ అగర్వాల్ తన బాబాయ్ ఇంట్లో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో దొంగతనం చేయడానికి పథకం రచించి, సల్మాన్ ఖాన్, మంజల్ సాయి కుమార్ ల సహాయంతో ఇంట్లోకి ప్రవేశించి బంగారం, వెండి, నగదును దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన సొత్తులో కొంత మొత్తాన్ని నిందితులు తమ అవసరాలకు వాడుకున్నారని, మిగిలిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
పరారీలో ఉన్న శ్రీహరి (A4) వద్ద 8 లక్షల రూపాయలు ఉన్నాయని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు విజయ్ అగర్వాల్ గతంలో పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నందున అతనిపై రౌడీ షీట్ తెరిచినట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు.
స్వాధీనం చేసుకున్న సొత్తులో 9 బంగారం ముద్దలు (580 గ్రాములు), ఒక బంగారం చైన్ (10 గ్రాములు), 2 వెండి లక్ష్మి బిళ్ళలు (300 గ్రాములు), వెండి ప్లేట్ (50 గ్రాములు), 19,33,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు ఉన్నాయి.








