ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) కోసం మే నెల వేతనం నుండి 1.5% వేతనాన్ని బలవంతంగా మినహాయించడాన్ని తెలంగాణ ప్రాథమికోపాధ్యాయుల సంఘం (TPTF) తీవ్రంగా ఖండించింది. ఈ మినహాయింపునకు సంబంధించి సరైన విధివిధానాలు లేవని, ఉద్యోగుల సమ్మతి తీసుకోలేదని సంఘం ఆరోపించింది.
TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం మే నెల వేతనం నుండి 1.5 శాతం మినహాయింపు చేస్తూ పేస్లిప్స్ జనరేట్ చేసిందని తెలిపారు. అయితే, ఈ పథకానికి సంబంధించి ఎలాంటి విధివిధానాలు రూపొందించకుండా, కనీసం డ్రాయింగ్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఈ మినహాయింపు చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో ఏ ఆసుపత్రులలో ఈ పథకం అమలు అవుతుందనే దానిపై స్పష్టత లేదని, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైన సందర్భాలలో, తల్లిదండ్రులు ఉద్యోగులైన సందర్భాలలో వేతన మినహాయింపులు ఏ విధంగా చేస్తారనే నిబంధనలు లేకుండానే ప్రతి ఉద్యోగి నుండి మినహాయింపు చేశారని పేర్కొన్నారు. ఇది అక్రమమైన చర్యగా TPTF భావిస్తోంది.
హెల్త్ కార్డులు జారీ చేయకుండా, ఉపాధ్యాయుల సమ్మతి తీసుకోకుండా మినహాయించిన 1.5 శాతం వేతనాన్ని ఉద్యోగుల ఖాతాలకు వెంటనే జమ చేయాలని TPTF డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించింది.











