సమాజ అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల ద్వారా అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తోషిబా సంస్థ CSR నిధులతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు, మహిళా సంఘాలకు రవాణా సౌకర్యాలు కల్పించారు.
గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ CSR కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు అందజేసిన రెండు బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ బస్సుల ద్వారా విద్యార్థులకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని, వారి విద్యాభ్యాసానికి ఇటువంటి సహకారం అందించడం ద్వారా సంస్థ సమాజం పట్ల తన బాధ్యతను చాటుకుందని మంత్రి తెలిపారు.
సంగారెడ్డి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల మరియు జోగిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్లకు ఆ బస్సులను కంపెనీ డైరెక్టర్ మారుమోటో చేతుల మీదుగా మంత్రి అందజేశారు.
అంతేకాకుండా, బిడెకన్నె మహిళా సంఘం సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను మార్కెట్కు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించేందుకు తోషిభా సంస్థ CSR నిధుల ద్వారా అందజేసిన మినీ వ్యాన్ను (Tata Ace) కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా మహిళా సంఘం ఉత్పత్తుల విక్రయాలు పెరగడమే కాకుండా, వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్లు, విద్యార్థులు, బిడెకన్నె మహిళా సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


