బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లిలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., పాల్గొన్నారు. ఈ విందును ముప్తి అతిక్ హైమద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
అప్నా ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మౌలానా సయ్యద్ అబ్దుల్ బాకీ నిర్వహించిన దువాలో పాల్గొని, అనంతరం ఉపవాస విరమణ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, రంజాన్ మాసం ఆత్మపరిశీలనకు, మనస్సును పరిశుభ్రం చేసుకోవడానికి ఒక అవకాశమని తెలిపారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
దానధర్మాలు, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత బలపడతాయని, అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. బోధన్‌కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు వెంకటనారాయణ, విజయబాబు, ఎస్సైలు మచ్చేందర్ రెడ్డి, భాస్కరాచారి, మనోజ్, మహేష్, హబీబ్, ఎంఐఎం అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ, కౌన్సిలర్లు మునిషీర్ బాబా, మీరు గౌస్, అడ్వకేట్ అబ్బీద్ సుఫి, ఆసిఫ్ సుల్తాన్, మహమ్మద్ ఇమ్రాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


