ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో భార్య పకోడీ తీసుకురమ్మని కోరగా, భర్త వెళ్లి తీసుకుని వచ్చేసరికి ఆమె అదృశ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్ గత ఏడాది డిసెంబర్ 1న రాంపూర్ జిల్లాకు చెందిన రింజిమ్ (18)ను వివాహం చేసుకున్నారు. ఇటీవల హోలీ పండుగ సందర్భంగా రింజిమ్ తన పుట్టింటికి వెళ్లింది.
పండుగ అనంతరం మార్చి 9న ప్రీతమ్ తన భార్యను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. బిలారి బస్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తున్న సమయంలో రింజిమ్ ఆకలిగా ఉందని, పకోడీలు తీసుకురావాలని భర్తను కోరింది. దీంతో ప్రీతమ్ పకోడీలు కొనుగోలు చేయడానికి వెళ్ళాడు.
ప్రీతమ్ పకోడీలు తీసుకుని తిరిగి వచ్చేసరికి రింజిమ్ అక్కడ కనిపించలేదు. భర్త బస్టాండ్ అంతా వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన భార్య ఒక యువకుడితో కలిసి వెళ్లిపోయి ఉండవచ్చని ప్రీతమ్ అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే, రింజిమ్ మొబైల్ లొకేషన్‌ను ట్రేస్ చేస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

