బాపట్ల జిల్లాలో నిశ్చితార్థం జరిగిన యువతి, ఆమె తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కాబోయే వరుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడటంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, ద్రోణాదుల గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దివ్యకు, అదే వృత్తిలో ఉన్న రావులకొల్లు శేషుబాబుతో నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా, అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. ఈ నెల 4వ తేదీన పెళ్లి సంబంధం విషయమై మాట్లాడుకోవడానికి దివ్యను పిలిపించిన శేషుబాబు, రహస్యంగా తీసిన ఫోటోలు, వీడియోలు చూపిస్తూ ఆమెపై నిందలు వేసి, పెళ్లికి నిరాకరించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన దివ్య, ఆమె తల్లి సుజాత అదే రోజు విషం సేవించారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే వారిని గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన దివ్య గురువారం తెల్లవారుజామున మరణించగా, కొద్ది గంటలకే తల్లి సుజాత కూడా తుదిశ్వాస విడిచింది. ఒకే కుటుంబంలో తల్లి, కూతురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిశ్చితార్థం తర్వాత జరిగిన పరిణామాలు, ఫోటోలు-వీడియోల అంశం, పెళ్లి రద్దు వెనుక ఉన్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారించి నిజానిజాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
పెళ్లి పీటలెక్కాల్సిన ఇంట్లో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సున్నితమైన అంశాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కాబోయే వరుడిపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు దృష్టి సారించారు.

