జీహెచ్ఎంసీ పరిధిలోని నాగారం డివిజన్, ఆర్.ఎల్. నగర్ – వినాయక్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన 'లిటిల్ లెర్నర్స్ ప్లే స్కూల్' శుక్రవారం ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలను ప్రారంభించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణను అందించడంలో ప్లే స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా ముప్పు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. చిన్న వయసులోనే విద్యా పునాదులు బలంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. స్థానిక ప్రాంతాల్లో ఇటువంటి ఆధునిక విద్యాసంస్థలు ఏర్పడటం ఆనందకరమని, ఇది చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలని ఆకాంక్షించారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో కాంగ్రెస్ నాయకులు కందాడి శ్రీనివాస్ రెడ్డి, పొట్ట పరమేష్, పంగ శ్రీహరి, కస్తూరి రవి తదితరులు పాల్గొన్నారు. వీరంతా పాఠశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
పాఠశాల ప్రిన్సిపల్ మానసా దేవి మాట్లాడుతూ, చిన్నారుల మానసిక, శారీరక వికాసానికి ప్రాధాన్యతనిస్తూ ఆటపాటలతో కూడిన ఆధునిక విద్యాబోధనను అందించనున్నట్లు తెలిపారు. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించే విధంగా పాఠ్య కార్యక్రమాలు రూపొందించామని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

