జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు దేవునిపల్లి ఆర్టీఏ కార్యాలయం వద్ద బుధవారం "క్షేమంగా – సురక్షితంగా గమ్యం చేరడం" నినాదంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణపై విస్తృత ప్రచారం చేపట్టారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు ఇచ్చారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని, మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డైల్ 100కు కాల్ చేయాలని సూచించారు.
పోలీస్ కళాబృందం సభ్యులు రామంచ తిరుపతి, శేషరావు, ప్రభాకర్, సాయిలు పాటలు, నాటికల ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందుతున్నవారు, లైసెన్స్ రీన్యువల్ కోసం వచ్చిన వాహనదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రాఫిక్ నిబంధనలు పాటించడానికి అంగీకారం తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, తద్వారా ప్రమాదాల సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని అవగాహన కల్పించారు.












