నిజామాబాద్, జూలై 28
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధతతో పనిచేసి పోలీసు శాఖపై విశ్వాసాన్ని బలోపేతం చేయాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. మంగళవారం టౌన్-3 పోలీసు స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నిబద్ధతతో పనిచేసి పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. మంగళవారం టౌన్-3 పోలీసు స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి కేసులో నాణ్యమైన విచారణ నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతి కేసుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ప్రజల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
సైబర్ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ల బారిన పడకుండా యువతను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
కాలనీల్లో ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకుని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదించాలని సూచించారు. నగరంలోకి వచ్చే అనుమానాస్పద వ్యక్తులపై నిఘాను మరింత పటిష్ఠం చేయడంతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడళ్లలో నిరంతర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
డ్రగ్స్ నియంత్రణకు యువతలో అవగాహన పెంపొందించాలని, ప్రతి కేసు దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని కమిషనర్ సూచించారు. అధికారులు, సిబ్బంది 24 గంటలూ ప్రధాన కార్యాలయ పరిధిలో అందుబాటులో ఉండాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. విధి నిర్వహణలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు.
ఈ తనిఖీలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ యాదవ్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్-3 ఎస్ఐ ఎ. హరిబాబు, ఎస్ఐ నారాయణతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












